మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Aug 29, 2020 , 15:39:38

ఉన్నత సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది: వెంకయ్య

ఉన్నత సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది: వెంకయ్య

న్యూఢిల్లీ : ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష – మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ప్రారంభించిన అనంతరం వెంకయ్య ప్రసంగించారు. మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. విదేశాల్లో ఉంటూ మాతృభాష కోసం తపిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు, అలాగే ఈ కార్యక్రమ ఏర్పాటుకు చొరవ తీసుకున్న, పాల్గొన వారందరికీ అభినందనలు తెలుపుతున్నా అన్నారు. 

ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారని.. పుస్తకాల్లోనూ సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించడం వల్లనే తెలుగు భాష దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతున్నదని చెప్పారు. కొద్దిమందికే పరిమితమైన విద్య గిడుగు వారి ఉద్యమం కారణంగా అందరికీ చేరువైందని, పండితులకే పరిమితమనుకున్న సాహిత్య సృష్టి, సృజనాత్మకత ప్రజలందరి పరమయ్యాయని, మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహనీయుకి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయని, ఆయా దేశాల ఒరవడి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. స్థానిక భాషల మీద ఆయా ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, నూతన జాతీయ విద్యావిధానం - 2020 సమగ్ర వికాసానికి ప్రాధాన్యమిస్తూ, భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో  వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని, తెలంగాణ జాగృతి సంస్థాపక అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల, దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరు, జర్మనీలోని హైడల్‌బర్గ్ విశ్వవిద్యాలయ భాష, సాంకేతిక అంశాల శాస్త్రవేత్త గణేష్ తొట్టెంపూడి సహా వివిధ విశ్వవిద్యాలయాల సంచాలకులు, తానా, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్ బెర్రా – ఆస్ట్రేలియా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ – ఆస్ట్రేలియా, తెలుగు కళా స్రవంతి – అబుదాబి, కలోన్ తెలుగు వేదిక – జర్మనీ, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo