Pune | మహారాష్ట్రలో(Maharastra) కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) జనజీవనానని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలో కొండచరియలు(Landslide collapses) విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మావల్ తాలూకాలోని పటాన్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్న ఇద్దరిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కర్జత్-లోనావాలా ఘాట్ సెక్షన్లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పూణేల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.16 రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. భద్రతా కారణాల దృష్ట్యా ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే, పాత ముంబై-పూణే హైవేపై రాకపోకలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.