పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ మంగళవారం కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం నిరుద్యోగం, ధరల మంటతో అల్లాడుతుంటే బీజేపీ మతతత్వ పోకడలను అనుసరిస్తూ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. రక్తం రుచిమరిగిన బీజేపీ ముస్లింలపై హిందువులను ఎగదోస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
బీజేపీ పాలిత యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలను లాలూ తీవ్రంగా ఖండించారు. విపక్షాలు తమ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడితే బీజేపీని మట్టికరిపించవచ్చని అన్నారు. బీసీ కులగణన చేపట్టలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడం పట్ల లాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను త్వరలోనే బిహార్లో అడుగుపెడతానని, తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని లాలూ తెలిపారు. బిహార్లో నితీష్ సర్కార్పైనా లాలూ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.