పట్నా : పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఐదో పశుగ్రాస స్కామ్ కేసులో దొరండ ట్రెజరీ నుంచి అక్రమ విత్‌డ్రాయల్స్ చేశారని పిబ్రవరిలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించింది.
ఈ కేసులో శిక్షను సస్పెండ్ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించిందని, లాలూకు బెయిల్ మంజూరు చేసిందని ఆర్జేడీ చీఫ్ తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో లాలూకు ఐదేండ్ల జైలు శిక్ష విధించగా సగానికి పైగా జైలు శిక్షను ఆయన ఇప్పటికే అనుభవించారని తాము కోర్టుకు నివేదించామని చెప్పారు. సీబీఐ లాలూ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించినా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.
పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా తేలగా ఐదో, తుది కేసులోనూ ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవిభక్త బిహార్‌లో ప్రభుత్వ ట్రెజరీల నుంచి అక్రమంగా విత్‌డ్రాయల్స్ జరిగిన ఈ కేసులో రూ 950 కోట్లు చేతులు మారాయి. పశుగ్రాస కేసుల్లో లాలూ ప్రసాద్‌కు 14 ఏండ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించగా నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. 1996లో పశుగ్రాస కేసు వెలుగుచూడగా జూన్ 1997లో లాలూను సీబీఐ నిందితుడిగా చేర్చింది. లాలూతో పాటు బిహార్ మాజీ సీఎం జగన్నాధ్ మిశ్రాలపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.