ముంబై : ముంబైలో ఈసారి గణేశుడి విసర్జన ఉత్సవాల్లో అపశృతి దొర్లింది. నగరంలో అతిపెద్ద వినాయకుడైన లాల్బగుచా రాజా ( Lalbaugcha Raja ) వినాయక విగ్రహాన్ని సుమారు 13 గంటల ఆలస్యంగా నిమజ్జనం చేశారు. గిర్గావ్ చౌపాటీ వద్ద జరిగిన ఆ వేడుక పట్ల కొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం 18 అడుగుల ఎత్తైన లాల్బగుచా రాజా గణేశ విగ్రహాన్ని అనంత చతుర్ధశి రోజున విసర్జనం చేస్తారు. కానీ మరుసటి ఉదయం 9 గంటల సమయంలో ఆ విగ్రహాన్ని సముద్రంలో విసర్జిస్తారు. అయితే ఈసారి కూడా సేమ్ టైంకే నిమజ్జనం ప్లాన్ చేశారు. కానీ, అనుకున్న సమయానికి లాల్బగుచా రాజాను విసర్జించడంలో నిర్వాహకులు విఫలం అయ్యారు. సముద్రంలో పున్నమి ఆటుపోట్లు ఉండడం వల్ల .. ఆదివారం రాత్రి 10.30 నిమిషాల సమయంలో నిమజ్జనం చేశారు. ఆ సమయం సూతక ముహూర్త కాలం కావడం వల్ల ఇది ఆధ్యాత్మికంగా అమంగళకరమైందిగా భక్తులు భావిస్తున్నారు.
లాల్బగుచ వినాయక విసర్జనం విషయంలో ఈసారి సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. హై టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఆధారంగా గణేశుడిని నిమజ్జనం చేశారు. ప్రతి ఏడాది మత్స్యకారుల కమ్యూనిటీ తయారు చేసే ఫ్లోటింగ్ బోటుపై లాల్బగుచా రాజాను నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి ఆ ప్లాట్ఫామ్లో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీంతో నిమజ్జనం ఆలస్యమైంది. కొన్ని గంటల పాటు చౌపాటీ వద్దే గణేశుడి స్తంభించిపోయాడు. దీంతో జాలర్ల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను పట్టించుకోవడం లేదని ఆ వర్గీయులు ఆరోపించారు.
1934వ సంవత్సరంలో మత్స్యకారులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారని, మార్కెట్లో చేపలు అమ్మలేకపోయారని, తమ సమస్యల్ని తీర్చితే గణేశ ఉత్సవాలను ఘనంగా నిర్హహిస్తామని మత్స్యకారులు మొక్కుకున్నారని, ఆ మొక్కు ప్రకారం లాల్బగుచ రాజాను ఏర్పాటు చేశారని, కానీ రానురాను జాలర్ల కుటుంబాలను విస్మరించారని, తమకు దర్శనం దక్కడం లేదని ఓ మత్స్యకారుడు ఆరోపించాడు. లాల్బగుచా దర్శనం కోసం గతంలో తమ జాలర వర్గ ప్రజలకు ఓ రోజును కేటాయించేవాళ్లు అని, అయితే క్రమక్రమంగా దాన్ని తగ్గించారన్నారు. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారన్నారు.
నిమజ్జనం రోజున బోట్ల మీద నుంచి లాల్బగుచ రాజాను దర్శనం చేసుకునే వీలు గతంలో ఉండేదని, కానీ ఈసారి ఆ అవకాశం కూడా లేకుండాపోయిందని ఓ మత్స్యకారుడు ఆరోపించాడు. ఆటోమెటిక్ పద్ధతిలో నిమజ్జనం చేయాలని నిర్వాహకులు ఈసారి కాంట్రాక్టు కుదుర్చుకున్నారని, దీంతో మత్స్యకారులకు అనుమతి ఇవ్వలేదన్నారు. కానీ సముద్రంలో అకస్మాత్తుగా వచ్చిన భారీ అలలు, సాంకేతిక సమస్యలు వాళ్ల ప్రణాళికను దెబ్బతీశాయన్నారు. వినాయకుడే తన నిమజ్జనాన్ని ఆపుకున్నాడని, సుమారు 13 గంటల పాటు ఆలస్యంగా విసర్జనం జరిగిందని, తాము పూజలు చేసుకునే అవకాశం గణేశుడు కల్పించినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
లాల్బగుచ రాజా నిర్వాహకులు భక్తులను సరిగా చూసుకోలేదని, కేవలం వీఐపీలకు మాత్రం ప్రాధాన్యత కల్పించారన్నారని ఆరోపించాడతను. లాల్బగుచ రాజా నిమజ్జనోత్సవ సమయంలో సుమారు 50 మొబైల్ ఫోన్లు , ఏడు బంగారు చైన్లు చోరీ అయినట్లు ఫిర్యాదులు అందాయి. ఇప్పటి వరకు పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. 10 కేసులను రిజిస్టర్ చేశారు. గోల్డ్ చైన్ కేసుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.