ముంబై, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : క్యూఆర్ కోడ్ చెల్లింపులను తనకు అనుకూలంగా మలచుకున్న యూపీకి చెందిన ఒక మోసగాడు ముంబైలోని వ్యాపారులను లక్షలాది రూపాయలకు టోకరా వేశాడు. చివరికి ఒక వ్యాపారి గమనికతో ఈ మోసం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం&ఖార్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న గుప్తా అనే దుకాణదారుడి క్యూఆర్ కోడ్‌ను సాన్ చేసి ఒక కస్టమర్ డబ్బు చెల్లించాడు. అయితే, ఆ మొత్తం తన ఖాతాలో జమ కాకపోవడంతో, లావాదేవీ పూర్తయిన తర్వాత వచ్చిన సందేశాన్ని గుప్తా పరిశీలించాడు.
ఆ సందేశం ప్రకారం డబ్బు శివం దూబే అనే వ్యక్తి ఖాతాకు జమ అయినట్లు కనిపించింది. దీనిపై గుప్తా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి గోరేగావ్‌కు చెందిన దూబేను అరెస్టు చేశారు. నిందితుడు తన బ్యాంక్ ఖాతా క్యూఆర్ కోడ్ పేపర్‌ను దుకాణాల బయట ఆయా దుకాణదారుల క్యూఆర్ కోడ్ల స్థానంలో అతికించేవాడు. దీంతో వినియోగదారులు చెల్లించే డబ్బు దూబే ఖాతాకు చేరేది.