దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కార్లతో తొక్కించి చంపుతారు.. మహిళను దేవతగా ఆరాధించే దేశంలో ఆ మహిళలనే చెరబడుతారు. చిన్న పిల్లలు అని చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతారు. ఆ దారుణాలు, ఘోరాలను ప్రశ్నించే గొంతుకలను పిసికేయడానికి కూడా వెనుకాడబోరు. ఇదీ ఎనిమిదేండ్ల మోదీ పాలన హయాంలో పలు రాష్ర్టాల్లో అధికారాన్ని అండగా చూసుకొని బీజేపీ మంత్రుల ‘సుపుత్రులు’ సాగించిన ఘోర కలి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మొన్న లఖింపూర్ ఖీరీ ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నలుగురు అన్నదాతల మరణానికి కారణమయ్యాడు. నిన్న ఉత్తరాఖండ్‌లోని యంకేశ్వర్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారిని బీజేపీ నేత, మాజీమంత్రి వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య హత్య చేసి కాలువలో పడేశాడు. ఇప్పుడు.. త్రిపురలో కార్మిక శాఖ మంత్రి, బీజేపీ నేత భగబాన్ దాస్ కుమారుడు ఇతరులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ఇదీ మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ‘బేటీ బచావో’ తీరు.. పేదలు, రైతులు, మహిళలపై అకృత్యాలకు తెగబడినప్పటికీ బీజేపీ నేతలు బెయిల్‌పై దర్జాగా బయటకు వస్తుండటం, క్రమంగా ఆ కేసులు నీరుగారిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
అసలేం జరిగిందంటే?
త్రిపురలో ఉనాకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ పట్టణంలో 16 ఏండ్ల ఓ బాలిక కుటుంబంతో నివసిస్తున్నది. పొరుగింట్లో ఉండే మహిళ బీజేపీ మహిళా ఫ్రంట్ సభ్యురాలు. ఆమె ఈ నెల 19న బాధిత బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాలికపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. అనంతరం బాలికను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. ఈ ముగ్గురిలో మంత్రి కొడుకే ప్రధాన నిందితుడు. ఘటనపై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 21న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే, ఘటనకు మంత్రి కొడుకే అసలు సూత్రదారి అని, ఘాతుకం జరిగిన భవనం కూడా మంత్రికి చెందినదేనని విపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష నేతలు ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు, వారి పుత్రుల దురాగతాల్లో కొన్ని..
2010: అక్రమ మైనింగ్ వ్యవహారాలను బయటపెడుతున్నాడని ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వాను హత్య చేసిన గుజరాత్ బీజేపీ మాజీ ఎంపీ దిను బోఘా సోలంకి.
2017: యూపీలో ఉన్నావ్‌లోని ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్, అతని సోదరుడు, అనుచరులు.
2017: తనపై నెలరోజులపాటు బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి లైంగికదాడి చేశాడని యూపీలోని బదోహికి చెందిన ఓ వితంతువు ఆరోపణ.
2021: సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న నలుగురు రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో బీజేపీ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.