డెహ్రాడూన్: భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న నదులన్నీ ఉప్పొంగిపోతున్నాయి. ఇక నైనిటాల్లో ఉన్న నైని సరస్సు కూడా ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ సరస్సు నుంచి నీరు .. నగర వీధుల్లో ప్రవహిస్తోంది. పట్టణంలో ఉన్న బిల్డింగ్లు, ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరుతోంది. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నైనిటాల్లో ఫేమస్ ప్రాంతమైన మాల్ రోడ్డు.. సరస్సు నీటితో నిండిపోయింది. గత 24 గంటల నుంచి నైనిటాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మోకాళ్ల లోతు మేర నీరు ఇండ్లల్లోకి చేరుకుంటోంది.
#WATCH | Uttarakhand: Nainital Lake overflows and floods the streets in Nainital & enters building and houses here. The region is receiving incessant heavy rainfall. pic.twitter.com/G2TLfNqo21
— ANI (@ANI) October 19, 2021
రహదారులు మూసివేత
నైనిటాల్, రాణిఖేట్, అల్మోరా, హల్ద్వాణి, కాత్గోడమ్కు వెళ్లే అన్ని జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. నిరాటంకంగా కురుస్తున్న వానల వల్ల ఉత్తరాఖండ్‌లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రిషికేశ్‌లో తపోవన్ బ్రిడ్జ్, లక్ష్మణ్ జూలా, ముని కీ రేతి, భద్రకాలి వంతనల నుంచి వాహనాలను వెళ్లనివ్వడం లేదు. అయితే వాతావరణం మళ్లీ కుదుటపడేవరకు చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచన చేశారు. ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల్లో పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయని, అక్కడ ఉన్న యాత్రికులు కూడా క్షేమంగా ఉన్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
అయిదుగురు మృతి
ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న వర్షాల వల్ల అయిదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. దాంట్లో ముగ్గురు నేపాలీ కార్మికులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల ఆ ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇక చంపావత్‌లో ఓ ఇళ్లు కూలడం వల్ల మరో ఇద్దరు మృతిచెందారు.
రిసార్ట్‌లో టూరిస్టులు..
రామ్‌నగర్-రాణికేట్ రూట్లో ఉన్న లెమన్ ట్రీ రిసార్ట్‌లో చిక్కుకున్న వంద మంది టూరిస్టులను సురక్షితంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని రెస్కూ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఉప్పొంగుతున్న కోశి నదిలోని నీరు ఆ రిసార్ట్‌లోకి ప్రవేశించినట్లు ఆయన చెప్పారు. దాంతో ఆ రిసార్ట్‌లోకి వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు.
క్లౌడ్‌బస్ట్..
నైనిటాల్ జిల్లాలోని రామ్‌ఘర్ గ్రామంలో కుంభవృష్టి కురిసింది. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.
తెగిన బ్రిడ్జ్.. బైకర్ సేఫ్
హల్ద్వాణిలో గౌలా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అయితే బ్రిడ్జ్ తెగిపోతున్న సమయంలో.. దానిపై ఉన్న వస్తున్న ఓ బైకర్‌ను స్థానికులు కాపాడారు. బ్రిడ్జ్ దాటుతున్న అతన్ని రావద్దు అంటూ మరో వైపు ఉన్న వాళ్లు ఆదేశించారు. నీటి స్థాయి పెరగడంతో క్రమంగా బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తి దూరంగా నిలిచిపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇదే.
#WATCH | Uttarakhand:Locals present at a bridge over Gaula River in Haldwani shout to alert a motorcycle rider who was coming towards their side by crossing the bridge that was getting washed away due to rise in water level. Motorcycle rider turned back & returned to his own side pic.twitter.com/Ps4CB72uU9
— ANI (@ANI) October 19, 2021