శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలోని గోపాల్పొరా ప్రాంతంలో హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు.
రజనీ జమ్మూ డివిజన్లోని సాంబా జిల్లా నివాసి. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి, మట్టుబెడుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట టీవీ నటిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారు.
మరో వైపు లక్షిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అవంతిపొరా ప్రాంతంలోని రాజ్పొరా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకు ముందు ఆదివారం, సోమవారాల్లో ఇద్దరు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.