ఇండోర్, డిసెంబర్ 12: వైద్య కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్న పోకిరీల ఆటకట్టించేందుకు పోలీసులు సినీ ఫక్కీలో ప్లాన్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్(ఎంజీఎం)లో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్లను అసభ్యకరంగా ర్యాగింగ్ చేస్తున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెల్ప్‌లైన్‌కు జూలై 24న గుర్తు తెలియని విద్యార్థి నుంచి ఒక ఫిర్యాదు అందింది. కానీ, నిందితుల పేర్లు, ఫిర్యాదు చేసిన విద్యార్థి పేరు మాత్రం ఇందులో లేవు. దీంతో నిందితులను గుర్తించడానికి ఒక మహిళా పోలీస్ అధికారి వైద్య విద్యార్థినిగా కళాశాలలో అడుగుపెట్టారు. నర్సుగా మరో మహిళా కానిస్టేబుల్, క్యాంటీన్ సిబ్బందిగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా మారువేషంలో కళాశాలలోకి ప్రవేశించారు. కొన్ని రోజులు కళాశాలలో ఉండి ర్యాగింగ్‌కు పాల్పడుతున్న 11 మంది విద్యార్థులను గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. వీరిని మూడు నెలల పాటు కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.