రాంచీ : పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా స్కూటీపై సరఫరా చేస్తుండగా ఎట్టకేలకు చిక్కింది. స్కూటర్లో నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుజాతసేన్ అనే గత ఏడాది కాలంగా డ్రగ్స్ సరఫరాలో నిమగ్నమై ఉన్నది. సాధారణ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించకుంటుండగా రాంచీలోని లోయర్ బజార్లో ప్రాంతంలో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా స్కూటీపై వెళ్తూ డ్రగ్స్‌ను సరఫరా చేసేది. కస్టమర్ నుంచి కాల్ వచ్చిన వెంటనే చెప్పిన అడ్రస్‌కు వెళ్లి, డ్రగ్స్ అందజేసేది.
అందుకు భారీగా డబ్బులు వసూలు చేసేది. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసిన స్కూటీపై ఓ పెట్టెలో పెట్టుకొని వెళ్తుండేది. అయితే, పోలీసుల విచారణలో బ్రౌన్ షుగర్ కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పిందని, అయితే ఆమె నుంచి బ్రౌన్ షుగర్ రికవరీ చేసుకోలేదని లోయర్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ తెలిపారు. సదరు మహిళ గతంలోనూ డ్రగ్స్ సరఫరా ఆరోపణలపై జైలుకు వెళ్లిందని, జైలు నుండి విడుదలయ్యాక మళ్లీ వ్యాపారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఓ మహిళ డ్రగ్స్ వ్యాపారం చేస్తుందని సమాచారం వస్తుందని, ఈ క్రమంలో ప్రత్యేకంగా నిఘా వేసి ఆమెను పట్టుకున్నట్లు వివరించారు.