భువనేశ్వర్, ఇండోర్, లక్నో, నోయిడా, జూలై 19: బీజేపీ పాలిత ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలలో మహిళలకు, బాలికలకు భద్రత కరువవుతున్నది. వారిపై దాడుల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజగా ఒడిశాలోని పూరి జిల్లాలో శనివారం గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ 15 ఏండ్ల బాలికకు నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న బాధితురాలిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించినట్లు అధికారులు తెలిపారు. బలంగా పోలీసు స్టేషన్ పరిధిలోని బమాబర్ గ్రామంలో శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళుతుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను బలవంతంగా భార్గవీ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆమెపై పెట్రోల్ వంటి ఇంధనం చల్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
బలంగా పోలీసు స్టేషన్ నుంచి 5-7 కిలోమీటర్ల దూరంలోని నువాగోపాల్పూర్ బస్తీలో ఆ బాలిక నివస్తోంది. ఆమె ఇంటికి సంఘటనా స్థలికి మధ్య 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుందని అధికారులు వివరించారు. బాలికకు నిప్పు పెట్టిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని వారు చెప్పారు. బాలికను కాపాడిన స్థానికులు పిపిలీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా అక్కడి నుంచి భువనేశ్వర్ ఎయిమ్స్‌కి తరలించారు. బాధితురాలి వైద్య చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జ్ మంత్రి ప్వరతవీ పరీదా తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఆమె చదువుకుంటున్న స్కూల్ వ్యాన్ డ్రైవర్ డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడు. నిందితుడు మొహమ్మద్ అరీఫ్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అలాగే, చిన్నారి చదువుతున్న కిడ్జీ స్కూల్ మేనేజర్ సందీప్ కుమార్‌పై పోక్సో, అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రైవేటు భాగాల్లో నొప్పిగా ఉందని బాలిక తన తల్లితో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే చిన్నారిని దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె ప్రైవేటు భాగాలపై గాయాలైనట్టు గుర్తించారు. మర్మావయవంలో ఏదో చొప్పించేందుకు ప్రయత్నించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంటనే బాలిక తల్లి స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.
రెండు రోజులుపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం లేకపోగా, ఫిర్యాదు చేస్తే చిన్నారి జీవితం పాడవుతుందని ఆయన తమను బెదిరించారని బాలిక తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, రెండు రోజుల తర్వాత మళ్లీ అదే డ్రైవర్‌ను తమ కూతురిని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు పంపారని తెలిపారు. తాను అతడితో వాగ్వివాదానికి దిగితే స్కూల్లో అందరి ముందే తనను బెదిరించాడని తెలిపారు. స్కూల్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరిందని పేర్కొన్నారు. మర్మావయవాల్లోకి వేళ్లు కానీ, బొమ్మలు కాని చొప్పించడాన్ని డిజిటల్ రేప్ అంటారు. ‘డిజిటల్’ అనే పదం చేతి వేళ్లు, లేదా కాలి వేళ్లను సూచిస్తుంది. దీనిని కూడా లైంగిక దాడిగానే పరిగణిస్తారు.
హర్యానాలోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి శర్మ అనే బీడీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆ యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇద్దరు ప్రొఫెసర్లతోపాటు ఆ యూనివర్సిటీ అధికారులు చాలా కాలం నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని, వారి వేధింపులు భరించలేకనే ఆహత్మహత్య చేసుకుంటున్నానని జ్యోతి శర్మ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. యూనివర్సిటీలోని ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేశామని గ్రేటర్ నోయిడా అదనపు డీసీపీ సుధీర్ కుమార్ వెల్లడించారు. వారిని సస్పెండ్ చేసినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్‌లోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల బాలుడిపై ఇద్దరు టీనేజర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. 16, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీసు అధికారులు తెలిపారు. స్కూలు ప్రాంగణంలోని మైదానంలో ఆడుకుంటున్న బాలుడిపై ఇద్దరు బాలురు బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడినట్లు వారు తెలిపారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితులు స్థానికులేనని పోలీసులు ధ్రువీకరించారు. వారిని జువైనల్ కరెక్షన్ హోంకు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తమ కొడుక్కి వైద్య పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరిగిందని బాధితుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.