భోపాల్ : ఇదొక బంగారు నిధికి సంబంధించిన ఘటన. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతంలో కూలీలు, పోలీసులు ఎవరికి వారు ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక గిరిజన కుటుంబానికి ఒక పాత ఇంటిని పడగొడ్తుండగా రూ.8-9 కోట్ల విలువజేసే బ్రిటీష్ కాలం నాటి అరుదైన 240 బంగారు నాణేలు దొరికాయి. ఆ నిధిని వారు గుట్టుచప్పుడు కాకుండా తమ రాష్ట్రం పట్టుకుపోయి ఇంట్లో పాతిపెట్టారు. ఎలా తెలిసిందో కానీ నలుగురు పోలీసులు వచ్చి వారిని బెదిరించి ఆ నాణేలు వారి నుంచి తీసుకుని పరారయ్యారు. దీంతో వారిని సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ వారి కోసం గాలిస్తున్నది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ అలిరాజ్పూర్ జిల్లాకు చెందిన రుక్మాబాయి కుటుంబం కూలిపనులు చేస్తుండేది. వారి కుటుంబం గుజరాత్లోని బిలిమోరలో ఎన్ఆర్ఐకి చెందిన ఒక పాత ఇంటిని కూలగొడుతుండగా 240 బంగారు నాణేలు దొరికాయి. వాటిని తమ రాష్ట్రం తీసుకుపోయి ఇంట్లో పాతిపెట్టారు. ఈ నెల 19న సోండ్వా పోలీస్ స్టేషన్ అధికారి విజయ్ దేవ్డా, మరో ముగ్గురు సివిల్ డ్రెస్లో వచ్చి వీరిని కొట్టి బంగారు నాణేలు తీసుకుని పారిపోయారు. దీంతో రుక్మాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న నాణేన్ని పోలీసులకు ఇవ్వడంతో వారు దానిని పరిశీలనకు పంపారు. అది 1922 నాటి బ్రిటీష్ నాణెంగా నిర్ధారించారు. ఒక్కో నాణెం 7.08 గ్రాముల బరువుందని, ఆ నాణెం ఒక్కొక్కటీ రూ.3-4 లక్షల విలువ చేస్తుందని చెప్పారు. పరారైన పోలీసులను సస్పెండ్ చేసి వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.