న్యూఢిల్లీ : భారత్‌పై అమెరికా ప్రభుత్వం మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా కార్మిక శాఖ శుక్రవారం ఓ కొత్త యాడ్‌ని విడుదల చేసింది. అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయులు కొల్లగొడుతున్నట్లు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో కార్మిక శాఖ ఆరోపించింది. యువ అమెరికన్ల కలలను విదేశీయులు కాజేశారని, హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ని దుర్వినియోగం చేస్తూ యువ అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కార్మిక శాఖ ఆరోపించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కార్మిక శాఖ మంత్రి లోరీ షావేజ్-డీరేమర్ నాయకత్వంలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగానికి పాల్పడుతున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నట్లు పోస్టు పేర్కొంది. అమెరికా ప్రజల అమెరికన్ స్వప్నాన్ని తిరిగి సాకారం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు కార్మిక శాఖ పేర్కొంది.అమెరికన్లకు ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ట్రంప్, షావేజ్ నినాదాన్ని ప్రస్తావించింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ఆడిట్‌ని కార్మిక శాఖ చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.