Heroines | వారానికో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కథానాయికలకు పెద్ద సవాలుగానే మారింది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ బలపడిన తర్వాత ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ తమ సత్తా చాటాలని హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు నార్త్ భామలు సౌత్ సినిమాలపై దృష్టి పెడుతుంటే, మరోవైపు దక్షిణాది కథానాయికలు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.ఇప్పటికే పలువురు సౌత్ హీరోయిన్లు హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టగా, కొందరు అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక ఫేడ్ అవుట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో దక్షిణాది హీరోయిన్ ప్రీతి ముకుందన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రీతి ముకుందన్, ఆ తర్వాత స్టార్ మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘కన్నప్ప’ సినిమాలో నెమలి పాత్రలో ఆమె చేసిన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇక మలయాళంలో ‘సర్వం మాయ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని, అన్ని భాషల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రీతి ముకుందన్‌కు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కార్తీక్ ప్రస్తుతం ‘నాగ్జిల్లా’ సినిమాతో పాటు దర్శకుడు కబీర్ ఖాన్‌తో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకదానిలో ప్రీతి హీరోయిన్గా ఎంపికయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకూలిస్తే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు గార్జియస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీపై వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్ ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’తో పాటు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. దీనితో పాటు పలు హిందీ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మృణాల్ ఓ తమిళ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో శింబు (STR) హీరోగా తెరకెక్కనున్న చిత్రం కోసం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. STR 51 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, అన్నీ సవ్యంగా జరిగితే ఈ సినిమాతోనే మృణాల్ ఠాకూర్ కోలీవుడ్‌లో అడుగుపెట్టనుందని తమిళ సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.