Bomb threat : కువైట్ (Kuwait) నుంచి ఢిల్లీ (Delhi) కి బయలుదేరిన ఇండిగో విమానానికి (IndiGo flight) బాంబు బెదిరింపు (Bomb threat) సందేశం రావడం కలకలం సృష్టించింది. దాంతో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగానే టాయిలెట్‌లోని ఓ టిష్యూ పేపర్‌పై బాంబు బెదిరింపు సందేశం కనిపించింది.
విమానంలో బాంబు పెట్టినట్లుగా ఆ టిష్యూ పేపర్లో రాసి ఉన్న బెదిరింపు సందేశాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించి, సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే స్పందించిన పైలట్లు అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. దాంతో విమానాశ్రయ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శుక్రవారం ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు.
ఆ తర్వాత ప్రయాణికులను కిందకు దించేసి, విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని, అధికారుల తుది అనుమతి పొందిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉందని విమానాశ్రయం అధికారి తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.