పాట్నా: కుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) స్పందించారు. మహా కుంభమేళా అర్థరహితమని అన్నారు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు రైల్వేనే కారణమని నిందించారు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగింది. 18 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
కాగా, మాజీ రైల్వే మంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లలో లోపాన్ని ఇది బయటపెట్టింది. ఈ సంఘటన తర్వాత రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. ఇది రైల్వే పూర్తి వైఫల్యం’ అని విమర్శించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద సంఖ్యలో జనం వెళ్లడంపై మీడియా అడగ్గా ‘కుంభమేళాకు అర్థం లేదు. ఇది అర్థరహితం’ అని అన్నారు.