Kulbhushan Jadhav : గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (Kulbhushan Jadhav) కు అనుకూలంగా 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పులో ఓ లొసుగును పాకిస్థాన్ వాడుకుంటోంది. ఆ తీర్పులో అంతర్జాతీయ న్యాయస్థానం సూచించినట్లుగా అతడికి అప్పీల్ చేసుకునే హక్కు ఇవ్వలేదని అంటోంది. 2019 జూన్‌లో ఐసీజే భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ హక్కును కల్పించాలని తేల్చిచెప్పింది.
ఈ కేసులో జాదవ్‌కు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను కోరింది. అప్పటివరకు ఉరిశిక్ష అమలు చేయొద్దని ఆదేశించింది. ఇదిలావుంటే 2023 మేలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ సైనిక కోర్టులు కొందరిని దోషులుగా నిర్ధారించాయి. దీనిని సవాలు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టులో దాఖలైన కేసుపై ఇటీవల విచారణ జరిగింది. దోషుల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ జాదవ్ కేసు గురించి ప్రస్తావించారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత పౌరుడు జాదవ్‌కు ఉన్న అప్పీలు హక్కు అల్లర్ల కేసుల్లో దోషులుగా తేలిన పాకిస్థాన్ పౌరులకు ఇవ్వలేదని అన్నారు.
దీనిపై పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాది స్పందిస్తూ.. అప్పట్లో దేశ న్యాయవ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించి అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్‌కు కాన్సులర్‌తో మాట్లాడేందుకు అనుమతిస్తూ ఆ తీర్పును ఇచ్చిందని తెలిపింది. ఆ తీర్పు తర్వాత వియన్నా ఒప్పందానికి అనుకూలంగా చట్టాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఇది పునఃసమీక్షకు మాత్రమే అవకాశం కల్పిస్తుందని చెప్పింది. ఇక 2023 అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న పౌరులు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునే హక్కును కల్పించే అంశంపై అటార్నీ జనరల్ మన్సూర్ ఉస్మాన్ అవాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని, దీనికి రెండు రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు కోర్టు పేర్కొంది.
నావికాదళంలో విధులు నిర్వర్తించి కొంత కాలానికి పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ ఇరాన్‌లోని చాబహార్లో వ్యాపారం చేసేవారు. 2016లో ఇరాన్లో పాకిస్థాన్ ఏజెంట్లు ఆయనను అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయనను తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్లో ఉంటున్న జాదవ్‌ను పాక్ అపహరించిందని ఆరోపించింది. జాదవ్ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2019లో దీనిపై దర్యాప్తు చేసిన ఐసీజే.. జాదవ్ భారత అధికారులతో మాట్లాడేందుకు వీలు కల్పించింది.