శ్రీనగర్‌లో చిక్కుకున్న రాష్ట్ర పర్యాటకులను సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేశారు. రాష్ర్టానికి చెందిన 80 మంది పర్యాటకులు మంగళవారం నుంచి శ్రీనగర్‌లోని ఓ హోటల్లో తల దాచుకున్నట్లు, వారిని వెంటనే తీసుకొని వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎక్స్ వేదికగా ఆయన కోరారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి అండగా నిలవాలని, అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. పర్యటన కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన సుమారు 80 మంది శ్రీనగర్‌లోని ఓ హోటల్లో తలదాచుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ సామాజిక మాధ్యమాల ద్వారా వారు ఓ వీడియోను విడుదల చేశారు. హోటల్లో ఉన్నవారిలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్‌నగర్ నుంని 15 మంది, సంగారెడ్డి నుంచి 10 మందితోపాటు మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. వీరంతా మంగళవారం జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లి శ్రీనగర్ హోటల్లో దిగారు. అకస్మాత్తుగా పహల్గాం ఘటన చోటుచేసుకోవడంతో వారు హోటల్లోనే ఉండిపోయారు.