కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో (RG Kar Medical College) వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. హాస్పిటల్ క్వాటర్స్‌లో ఆమె మృతదేహాన్ని డాక్టరైన తల్లి గుర్తించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐవీ ప్రసాద్ అనే యువతి కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్నది. డాక్టరైన తల్లితో కలిసి కామర్హటిలోని ఈఎస్ఐ హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఆమె నివసిస్తున్నది.
కాగా, ఆదివారం తన కుమార్తెకు ఆమె తల్లి ఫోన్ చేసింది. ఫోన్ కాల్స్‌కు సమాధానం రాకపోవడంతో డాక్టరైన తల్లి ఆందోళన చెందింది. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూసింది. కుమార్తె అనుమానాస్పదంగా మరణించడాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వైద్య విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యువతి మృతికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. బ్యాంకులో పని చేస్తున్న మృతురాలి తండ్రి ముంబైలో నివసిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ లేడీ డాక్టర్ సెమినార్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. కలకలం రేపిన ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడైన సంజయ్ రాయ్‌కు సీబీఐ కోర్టు ఇటీవల యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే దోషికి మరణ శిక్ష విధించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.