Kolkata | కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ క్యాంపస్‌లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపై సైతం ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఇదిలా ఉండగా కొందరు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం. ఘటన అనంతరం కాలేజీ క్యాంపస్‌లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ నెల 9న ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే.
ఆమెపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు గుర్తించగా.. ఈ కేసులో ఓ సివిల్ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అయితే, ఘటనకు వ్యతిరేకంగా బుధవారం అర్ధరాత్రి పలువురు నిరసనలు చేపట్టారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆందోళనకారుల ముసుగులో కొందరు అర్ధరాత్రి క్యాంప్‌లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై సైతం రాళ్లు రువ్వారు. దీంతో కొందరు పోలీసులు గాయపడ్డారని.. పోలీసుల వాహనాలు సైతం దెబ్బతిన్నాయని ఆ అధికారి తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చిందన్నారు.
ఆ తర్వాత అల్లరిమూకలు పారిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఆరోపించారు. ఇక్కడ ఏం జరిగినా మీడియా తప్పుడు ప్రచారం వల్లే జరిగిందని.. కోల్‌కతా పోలీసులపై దురుద్దేశపూరిత మీడియా ప్రచారం చేస్తోందన్నారు. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు ఏం చేయలేదని ప్రశ్నించారు. ప్రతీది చేశామని.. కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించామన్నారు. అయితే, పుకార్లు పుట్టిస్తున్నారని.. ఒకే వ్యక్తి నిందితుడు అని తాము చెప్పుడూ చెప్పలేదన్నారు. శాస్త్రీయ ఆధారాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. అందుకు సమయంపడుతుందని చెప్పామన్నారు.
కేవలం పుకార్ల ఆధారంగా యువ పీజీ విద్యార్థిని అరెస్ట్ చేయలేమని.. అది మనస్సాక్షికి విరుద్ధమన్నారు. మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉందని, అయితే తాము చేసింది సరైనదేనని తెలిపారు. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని.. తాము పూర్తి సహకారం అందిస్తామన్నారు. పుకార్లను ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. అయితే, హింసకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, ఆసుపత్రి ఇంటర్న్ వైద్యుడు హసన్ ముస్తాక్ మాట్లాడుతూ.. కొందరు న్యాయం చేయాలంటూ క్యాంపస్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ఆ తర్వాత బారికేడ్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని తెలిపారు.