Messi Event : ‘గోట్ ఇండియా టూర్ (GOAT India Tour)’ లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) కోల్కతాకు వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి, గందరగోళం సృష్టించినందుకుగాను శుభ్రప్రతిమ్ డే (Subhrapratim Dey), గౌరవ్ బసు (Gaurab Basu) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దాంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇవాళ అరెస్టయిన ఇద్దరిని కూడా పోలీసులు కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరనున్నారు.
ఇదిలావుంటే మెస్సీ ఈవెంట్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మెస్సీ సోమవారం ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.