కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు నేడు (శనివారం) తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా, ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, సీల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాసు ముందు విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత తీర్పు వెలువరించనున్నారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి.
గతేడాది ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై (31) హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆగస్టు 13న 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేసిది. 66 రోజుల పాటు విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిన డీఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాదించింది.