మంగళవారం 31 మార్చి 2020
National - Mar 16, 2020 , 18:10:05

మార్చి 24న తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మార్చి 24న తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల: శ్రీ‌వారి ఆలయంలో మార్చి 25వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ శార్వ‌రి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో మార్చి 24న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, హ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా  ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 25వ తేదీన‌ ఉగాది ప‌ర్వ‌దినం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉద‌యం, సాయంత్రం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం, ఆర్జితసేవలైన కుంకుమార్చన, సహస్రదీపాలంకార సేవ, ఊంజ‌ల్‌సేవల‌ను టీటీడీ రద్దు చేసింది.  


logo
>>>>>>