Ayodhya Ram Mandir | అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమయ్యింది. కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మహత్తర ఘట్టం మరి కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. శ్రీరాముని ప్రతిష్ఠాపనకు 2024 జనవరి 22వ తేదీని శుభ సమయంగా నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని.. ఆ సమయంలోనే ప్రాణప్రతిష్ఠ చేయాలని నిర్ణయించినట్లు వేద పండితులు చెబుతున్నారు. దీంతో 84 సెకండ్ల పాటు ఉండే ఈ శుభ గడియల విశిష్టత ఏంటని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ముహూర్తం వివరాలను వెల్లడించారు.
‘ వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ ముహూర్తంలో గురు స్థానం చాలా బలంగా ఉంటుంది. గురు రాజయోగం కల్పిస్తాడు. గురు ఐదు, ఏడు, తొమ్మిదో స్థానంలో ఉటాడు. ఏడో స్థానంలో గురు ఉంటే అందరి మనసులు చక్కగా ఉంటాయి. లక్ష సమస్యలు పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉంటుంది. అంత మహిమ కలిగిన గురు.. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ఉచ్ఛస్థితిలో ఉంటాడు.’ అని గణేశ్వర్ శాస్త్రి వివరించారు. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుంది.. అలాంటిది రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల దేశ కీర్తి మరింత పెరుగుతుందని అన్నారు.