Kisan Express | వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పలుచోట్ల పట్టాలు తప్పగా.. పలు ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యాడు. తాజాగా మరో ఘటన చోటు చేసుకున్నది. రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. ఫిరోజ్‌పూర్ నుంచి ధన్‌బాద్ వెళ్తున్న కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు సియోహరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ రైల్వేగేట్ సమీపంలో రెండుభాగాలుగా విడిపోయింది. రైలులో మొత్తం 21 కోచ్‌లు ఉండగా.. ఇందులో ఎనిమిది కోచ్‌లు విడిపోయాయి. ఆ తర్వాత గమనించిన అధికారులు మిగతా కోచ్‌లను సియోహరా రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అదే మార్గంలో మరో రైలు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకున్నది.
వేకువ జామున 3.36 గంటల ప్రాంతంలో రైలు ధాంపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. 3.45 గంటలకు సర్కడ చక్రజామల్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన అనంతరం రాయ్‌పూర్ రైల్వేగేట్ సమీపానికి రాగానే రైలు రెండుభాగాలు విడిపోయింది. ఎనిమిది కోచ్‌లు విడిపోగా.. మిగతా రైలు సియోహరా స్టేషన్‌కు చేరగా.. రాయ్‌పూర్ సమీపంలో ఎనిమిది కోచ్‌లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై గార్డ్ సమాచారం అందించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఎస్పీ ధరమ్ సింగ్, పోలీస్ సర్కిల్ సర్వం కుమార్, కొత్వాల్ కిషన్ అవరాత్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కోచ్‌లను రైలుకు అనుసంధానించారు. రైలులో ఉన్న ప్రయాణికుల్లో ఎక్కువగా పోలీస్ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులే ఉన్నారు. ఈ ఘటన అనంతరం రైల్వేగేట్ వద్ద అధికారులు బస్‌లను ఆపి.. అభ్యర్థులను గమ్యస్థానాలకు పంపారు. ఈ రైలు ఘటనతో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ధాంపూర్ రైల్వే స్టేషన్లో పంజాబ్ మెయిల్ దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయింది. ధాంపూర్‌లో స్టాపే లేని జననాయక్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై తీవ్ర ప్రభావంపడింది.