న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు కిలో కొకైన్‌ను క్యాప్సూల్స్(మాత్రలు) రూపంలో కడుపులో దాచుకొని దేశంలోకి ప్రవేశించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండా నుంచి వచ్చినట్లు గుర్తించారు. డ్రగ్స్ విలువ దాదాపు రూ.14 కోట్ల మేర ఉంటుందని అంచనా. మహిళను స్థానిక ఆర్ఎంఎల్ దవాఖానకు తరలించగా, వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి 91 కొకైన్ క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. 993 గ్రాముల బరువున్న వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా శరీరంలో దాచుకొని 400-500 గ్రాముల డ్రగ్స్‌ను రవాణా చేయడం చూశామనీ, ఇంత భారీ మొత్తాన్ని ఎన్నడూ చూడలేదని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్యాప్సూల్స్ పేలితే ప్రాణానికి ప్రమాదం ఉండేదన్నారు.