Kidneys Surgery | ఢిల్లీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు నెలల చిన్నారి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. అత్యంత పిన్న వయస్కురాలి రెండు కిడ్నీలకు ఏకకాలంలో శస్త్ర చికిత్స చేయాల్సి రావడం వైద్య చరిత్రలో ఇదే తొలిసారని వైద్యులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో నివాసం ఉంటున్న మూడు నెలల చిన్నారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నది. దీంతో ఎయిమ్స్ వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయగా.. పుట్టినప్పటి నుంచి చిన్నారి కిడ్నీ వాపుతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. దాంతో చిన్నారి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందిపడుతున్నది. దీనికి శస్త్ర చికిత్స చేయడం తప్పనిసరి. లేకపోతే కిడ్నీల ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో పాటు మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంది.
అత్యంత పిన్న వయస్కురాలికి రెండు కిడ్నీలకు ఏకకాలంలో శస్త్ర చికిత్స చేయాల్సి రావడంతో వైద్య చరిత్రలో ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌లోని పిడియాట్రిక్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ మాట్లాడుతూ.. మూడు నెలల చిన్నారికి కిడ్నీ సర్జరీ కోసం ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ సర్జరీని ఎయిమ్స్ హెడ్ ప్రొఫెసర్ మీను వాజ్‌పేయి నేతృత్వంలో బృందం నిర్వహించింది. నాభి దగ్గర మూడు ఎంఎంలతో రంధ్రం చేసి చిన్నారి శరీరంలోకి కెమెరా, ఇతర ఆపరేషన్‌కు సంబంధించిన పరికరాలను పంపి కిడ్నీల శస్త్ర చికిత్స చేశారు. దాదాపు రెండ గంటల పాటు శ్రమించి మూత్రనాళాన్ని (యూరోపెల్విక్ జంక్షన్) జాగ్రత్తగా పునర్నిర్మించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే చిన్నారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. మళ్లీ నాలుగు నెలల తర్వాత ఆసుపత్రికి రాగా.. పరీక్షలు చేయగా.. రెండు కిడ్నీలు సవ్యంగా పని చేస్తుందని తేలిందని డాక్టర్ జైన్ తెలిపారు. ప్రసుతం చిన్నారికి ఏడు నెలలని, భవిష్యత్‌లో కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు.
లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీ ప్రక్రియ అనేది ఇన్వాసివ్ సర్జికల్ టెక్నిక్. ఇది యురోపెల్విక్ జంక్షన్ అడ్డంకి (UPJO) ఏర్పడిన సమయంలో చికిత్స చేస్తారు. కొందరు పిల్లల మాత్ర నాళంలో పుట్టుక నుంచే అడ్డంకి ఏర్పడుతుంది. మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు మూత్ర ప్రవాహంలో సమస్య ఎదురవుతుంది. ఈ తరహాలోనే చిన్నారి రెండు కిడ్నీల్లోనూ సమస్య ఏర్పడింది. శస్త్ర చికిత్స నిర్వహించి సరి చేశారు. సర్జరీ చేసిన కొద్ది రోజుల తర్వాత సాధారణ చెపక్ కోసం మళ్లీ పిలిపించినట్లు డాక్టర్ విశేష్ జై తెలిపారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో భవిష్యత్తులో శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌కు సంబంధించిన గుర్తులు సైతం మానిపోయాయన్నారు.