భువనేశ్వర్: మూడు రోజులపాటు జరుగనున్న డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డీజీపీ-ఐజీపీ) కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలిగిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరించాడు. (Khalistani Terrorist Pannun) ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొనే ఈ సదస్సును లక్ష్యంగా చేసుకుంటామని నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడైన ఆ ఉగ్రవాది వీడియో ద్వారా హెచ్చరించాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు డీజీపీ-ఐజీపీ సదస్సు జరుగనున్నది.
కాగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ పన్నూన్ బెదిరింపు నేపథ్యంలో భువనేశ్వర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్-2024కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, క్విక్ రియాక్షన్ టీమ్స్తోపాటు విధ్వంస నిరోధక తనిఖీ బృందాలను మోహరించారు. భువనేశ్వర్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్, బ్లాకింగ్లను ముమ్మరం చేశారు. సీసీటీవీ, మానవ నిఘా బృందాలతో నగరంలోని భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు మూడు రోజుల పాటు జరిగే డీజీపీ-ఐజీపీ సదస్సుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ సలహాదారుడు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డీజీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చీఫ్‌లు హాజరవుతారు.