న్యూఢిల్లీ, అక్టోబర్ 26: చికిత్సకు, సర్జరీకి రోగి సానుకూలంగా స్పందించకపోయినా, శస్త్ర చికిత్స విఫలమైనా వైద్యపరమైన నిర్లక్ష్యం చూపారని వైద్యుడిని నేరుగా బాధ్యుడిని చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు నిర్లక్ష్యంగా వైద్యం అందించారని జస్విందర్ సింగ్ అనే వ్యక్తి ఛండీగఢ్‌కు చెందిన డాక్టర్ నీరజ్ సుద్పై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించారు. దీంతో బాధితుడికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని వైద్యుడిని కమిషన్ ఆదేశించింది. మరో రూ.50 వేల జరిమానా విధించింది. ఈ ఆదేశాలను వైద్యుడు నీరజ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది.
‘వైద్యుడు తన నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించడంలో, విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యాడనే కచ్చితమైన ఆధారం లేనిదే వైద్య పరమైన నిర్లక్ష్యానికి బాధ్యుడిని చేయలేం. వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిరూపించేలా ఆధారాలు ఉండాలి. కేవలం సరైన చికిత్స ఇవ్వలేదనడం, చికిత్సకు సంబంధించి వైద్యుడి నిర్ణయ లోపం వంటివి వైద్య నిర్లక్ష్యాన్ని నిరూపించేందుకు ఆధారాలుగా సరిపోవు. సర్జరీకి, చికిత్సకు సానుకూలంగా స్పందించలేదనో, సర్జరీ విఫలమైందనో వైద్యుడిని నేరుగా బాధ్యుడిని చేయలేం. సర్జరీ, చికిత్స తీసుకున్న ప్రతి కేసులో రోగి పరిస్థితి అతడి సంతృప్త స్థాయిలో మెరుగవ్వాలని లేదు’ అని కోర్టు స్పష్టం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యానికి సరైన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ ఎన్సీడీఆర్సీ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.