Thiruvananthapuram : కేరళ, తిరువనంతపురంలోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రమాదం జరిగింది. ఒక భారీ జెయింట్ వీల్ (స్కై రైడ్) కూలిపోవడంతో అందులో రైడ్ చేస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరువనంతపురం, వెంబాయంలోని, హ్యాపీలాండ్ వాటర్ థీమ్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొందరు విజిటర్స్ ఇక్కడి జెయింట్ వీల్ ఎక్కారు.
వారు రైడ్ చేస్తుండగా ఉన్నట్లుండి జెయింట్ వీల్ విరిగిపోయి, కింద పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంజారమూడుకు చెందిన పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక గోకులం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలుకాగా, మరికొందరి ఎముకలు విరిగిపోయినట్లు తెలుస్తోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పార్క్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. జెయింట్ వీల్కు సంబంధించిన సపోర్ట్ స్టాండ్ విరిగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
#WATCH | Thiruvananthapuram, Keralam: Five people, including two children, were injured after a giant wheel ride collapsed at Happyland Amusement Park around 2 pm in Vembayam near Thiruvananthapuram.
Preliminary findings suggest that a failure in the welding joints and… pic.twitter.com/7CtwrJTKr1
— ANI (@ANI) May 28, 2026
ఇక్కడ వెల్డింగ్ సరిగ్గా చేయకపోవడం, ఈ విషయంలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. మరోవైపు ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందే జెయింట్ వీల్ స్లో అయింది. దీనిలో ఏదో లోపం ఉందని తెలిసింది. ఈ సమయంలో నిర్వాహకులు సరిగ్గా స్పందించి ఉంటే ప్రమాదం జరగకుండా ఆపి ఉండేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.