తిరువనంతపురం: కేరళ ప్రొఫెసర్ టీజే జోషెఫ్ చేయి నరికిన కేసులో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పెషల్ కోర్టు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. మరో ఐదుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్ధోషులుగా విడిచిపెట్టింది. దోషులుగా నిర్ధారణ అయిన ఆరుగురికి త్వరలో శిక్షలు ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
కేరళ రాష్ట్రం తొడుపుజలోని న్యూమాన్ కాలేజీలో టీజే జోషెఫ్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. కాలేజీ ఇంటర్నల్ పరీక్షల కోసం జోషెఫ్ తయారు చేసిన ఓ ప్రశ్నపత్రం మహ్మద్ ప్రవక్తను కించపర్చేదిగా ఉందంటూ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)’ పేరుతో ఓ గ్యాంగ్ ఆయన కుడిచేతిని నరికేసింది. 2010 జూలై 4న అంటే 13 ఏళ్ల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనపై ముందుగా కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత కేరళ పోలీసుల నుంచి ఈ కేసును NIA టేకోవర్ చేసింది. తొలిదశ విచారణలో భాగంగా మొత్తం 31 మంది నిందితులను విచారించిన NIA కోర్టు 2015లో 13 మందిని దోషులుగా తేల్చింది. మిగతా 18 మందిని సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.
ఆ తర్వాత దర్యాప్తు అధికారులు రెండో దశ విచారణలో భాగంగా తొలి దశలో నిర్దోషులుగా తేలిన 18 మందిలో 11 మందికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ 11 మందిలో మరో ఆరుగురు దోషులుగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఐదుగురు మరోసారి కేసు నుంచి బయటపడ్డారు.