Viral Video | బస్సులో మహిళను అసభ్యంగా తాకాడంటూ సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కోజికోడ్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) శుక్రవారం ( జనవరి 16వ తేదీన) ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. అదే సమయంలో తనతో, మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శిమ్జిత అనే మహిళ ఆరోపిస్తూ ఒక వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసింది. రద్దీగా ఉన్న బస్సులో మహిళ శరీరాన్ని దీపక్ మోచేతితో తాకినట్లుగా ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇలా మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్ కావడంతో.. అది చూసిన దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతనికి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ పరువు పోయిందని భావించిన దీపక్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దీపక్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. ఎంతసేపటికీ డోర్ తీయలేదు. దీంతో బలంగా డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దీపక్ విగతజీవిగా కనిపించాడు. దీంతో శమ్జిత పెట్టిన వీడియో కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. “ఆ వీడియో దీపక్‌ను కుంగదీసింది. నిజం తెలియకుండా వీడియోలు పోస్టు చేయవద్దు. ఎవరి జీవితాలతో ఆడుకోవద్దు” అని దీపక్ సన్నిహితులు రిక్వెస్ట్ చేశారు.
బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి వైరల్ చేసిన యువతి
నిందారోపణ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాధితుడు
కేరళ – బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి
వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను… pic.twitter.com/9ZBJHpRdiY
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
వైరల్‌గా మారిన వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కూడా దీపక్‌కు సపోర్టు చేస్తున్నారు. బస్సులో రద్దీ కారణంగా అనుకోకుండా మహిళను తాకాడని.. ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే శమ్జిత మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. దీపక్ ఉద్దేశపూర్వకంగానే తాకాడని స్పష్టం చేశారు.
“పయ్యనూర్‌కు వెళ్తున్న సమయంలో బస్సులో ఓ మహిళ అసౌకర్యంగా ఫీలవ్వడం గమనించారు. ఓ వ్యక్తి ఆమె వెనుక చాలా దగ్గరగా నిల్చొని ఉన్నాడు. అది గమనించి నేను సెల్ఫీ వీడియో తీశా. అది గమనించి చాలాసేపు అతను సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత బస్సులో రద్దీ పెరగానే.. అతను మళ్లీ నా దగ్గరగా వచ్చాడు. అప్పుడు మళ్లీ వీడియో తీశా. ఆ రెండింటినీ కలిపి సోషల్‌మీడియాలో పోస్టు చేశా.” అని తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదని చెప్పారు.
పురుషుల హక్కుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్న రాహుల్ ఈశ్వర్ ఈ ఘటనపై స్పందించారు. సోషల్‌మీడియాలో వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరికీ ఇలా జరగకుండా ఉండాలంటే.. తప్పుడు కంటెంట్ సృష్టించేవారిపై ఇప్పుడే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.