తిరువనంతపురం, ఆగస్టు 7: సరైన నిర్వహణ లేని రహదారులపై టోల్ వసూలు చేయరాదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రయాణికుల భద్రత, సజావుగా ప్రయాణం సాగించడానికి వీలు లేని రహదారులపై టోల్ వసూలు చేయడాన్ని అన్యాయమైనదిగా హైకోర్టు పేర్కొన్నది. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, అత్యంత అధ్వానమైన రోడ్డు పరిస్థితులను కారణంగా చూపుతూ జాతీయ రహదారి-544పై ఎడప్పల్లి-మన్నుత్తీ మార్గంలో టోల్ వసూలును నాలుగు వారాలపాటు హైకోర్టు రద్దు చేసింది.
జాతీయ రహదారులపై ప్రయాణాలు సజావుగా, భద్రతతో ఉండేట్టు చూడాల్సిన బాధ్యత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(ఎన్హెచ్ఏఐ)దేనని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. టోల్ వసూలు అనేది కాంట్రాక్ట్ హక్కుగా పేర్కొన్న ‘ఎన్హెచ్ఏఐ’ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రైవేట్ ఒప్పందం కన్నా ప్రజా ప్రయోజనమే ముఖ్యమైందని తెలిపింది.