తిరువనంతపురం : కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవా(Innova Crysta) కార్లను ఖరీదు చేసేందుకు రూ.2.71 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కోసం ఇన్నోవా కార్లను కొనుగోలు చేశారు. సుమారు 8 ఇన్నోవా క్రిస్టా కార్లను ప్రభుత్వం ఖరీదు చేసింది. దానికి రూ.2.71 కోట్లు అయినట్లు సీఎం పినరయి విజయన్ తెలిపారు. మంత్రుల కోసం కొన్న కార్ల విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే ఎల్డోస్ పీ కున్నప్పిల్లి వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కేరళ మంత్రులు అందరూ ఇన్నోవా క్రిస్టా కారునే ఫెవరేట్ చెప్పినట్లు సీఎం తెలిపారు.
2022 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 8 ఇన్నోవా క్రిస్టా కార్లను ఖరీదు చేసింది. కే రాజన్, రోషీ ఆగస్టిన్, సాజి చెరియన్, పీ ప్రసాద్, వీ శివన్కుట్టి, మహమ్మద్ రియాస్, వీణా జార్జ్, అబూ రహిమన్ మంత్రులు ఆ కార్లను వాడుతున్నారు. ఇక 2024లో మరో మూడు కార్లను ఖరీదు చేశారు. వీఎన్ వాసవన్, ఆర్ బిందు, జీఆర్ అనిల్ కోసం కార్లు కొన్నట్లు చెప్పారు. 2022లో ఒక్కొక్క కారు 24.28 లక్షలు కాగా, 2024లో ఆ కార్లు ఒక్కొక్కటి 25.78 లక్షలు పడినట్లు తెలుస్తోంది. 13 మంది మంత్రలకు కార్లను రీప్లేస్ చేసినట్లు సీఎం విజయన్ వెల్లడించారు.