అలప్పుజా: కేరళలో కేజీ ప్రసాద్ అనే రైతు ఆత్మహత్య(Farmer Suicide) చేసుకున్నాడు. కుట్టనాడ్ ప్రాంతంలోని అలప్పుజాకు చెందిన అతని వయసు 55 ఏళ్లు. వరి పంట సాగు కోసం నిధులను సమకూర్చుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం అతను విషం తాగి మరణించాడు. తిరువల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ అతను సూసైడ్ నోట్ రాశాడు. తాను ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లడానికి బ్యాంకులే కారణమని ఆ లేఖలో పేర్కొన్నాడు. బ్యాంకులు రుణం ఇవ్వలేకపోవడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపించాడు.
సూసైడ్ నోట్లో ప్రసాద్ ఇలా రాశాడు. 2011లో ఓ మేజర్ బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే పేమెంట్ చేయలేక డిఫాల్ట్ అయ్యాడు. ఆర్థిక స్థితి సరిగా లేక ఆ బ్యాంకుకు 20 వేల చెల్లించాడు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో ఆ లోన్ తీర్చేశాడు. వన్ టైం పేమెంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని కట్టేశాడు. ఇక ఆ తర్వాత ఏ ఒక్క బ్యాంక్ కూడా తనకు రుణం ఇచ్చేందుకు ముందుకు రాలేదన్నాడు. సిబిల్ స్కోరు పడిపోవడం వల్ల రుణం సంపాదించడం ఇబ్బంది అయినట్లు తన లేఖలో తెలిపాడు.
అలప్పుజా సమీపంలోని నాలుగు ఎకరాల్లో రైతు ప్రసాద్ వరి పంట పండిస్తున్నాడు. పీఆర్ఎస్ లోన్‌కు చెందిన వడ్డీ కట్టేందుకు రాష్ట్ర సర్కారు విఫలమైందని, దాని వల్ల కూడా సిబిల్ స్కోరు మరింత పడిపోయిందన్నాడు. ఎన్ని బ్యాంకులు తిరిగినా అతనికి రుణం రాలేదు. ఎరువులు కొనేందుకు అతనికి డబ్బు దొరకలేదు. వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొనేందుకు డబ్బు లేకపోవడంతో అతను ఈ సారి పంట వేయలేదు. 2022-23 సీజన్‌కు చెందిన పీఆర్ఎస్ రుణాలను రాష్ట్ర సర్కారు బ్యాంకులకు రిలీజ్ చేయకపోవడంతో తనకు ఈ పరిస్థితి ఎదురైనట్లు అతను పేర్కొన్నాడు.
జీవితంలో విఫలం అయ్యాయని, 20 ఏళ్ల క్రితం మద్యం తాగడం మానేశానని, కానీ ఇప్పుడు పరిస్థితి వల్ల మళ్లీ మద్యానికి అలవాటు కావాల్సి వస్తోందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అతను చెప్పాడు. రైతు ప్రసాద్ .. బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్త. భారతీయ కిసాన్ సంఘ్‌లో అతను జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాడు.
పీఆర్ఎస్ రుణాల విషయంలో రైతులకు ప్రభుత్వం ఎటువంటి బాకీ లేదని ఆ రాష్ట్ర మంత్రి జీఆర్ అనిల్ తెలిపారు.