తిరువనంతపురం: డెంటల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు. అతడి రంగు, కులం పేరుతో అధ్యాపకులు వేధించినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు. (Kerala Student Suicide) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరువనంతపురం జిల్లా ఉజమలక్కల్కు చెందిన 22 ఏళ్ల నితిన్ రాజ్, కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 10న మధ్యాహ్నం వేళ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆత్మహత్యకు ముందు రాజ్ తన స్నేహితులకు ఆడియో మెసేజ్ పంపాడు. అధ్యాపకులు తనను వేధిస్తున్నారని, శారీరకంగా దాడి చేస్తామని, పరీక్షల్లో మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. అలాగే అతడి నల్ల రంగు, పేద కుటుంబ కారణంగా ప్రొఫెసర్లు మానసికంగా, మాటలతో వేధించినట్లు రాజ్ కుటుంబం ఆరోపించింది.
ఒకసారి రాజ్‌ను స్టాఫ్ రూమ్‌కు పిలిచి తీవ్రంగా వేధించారని, ఒక అధ్యాపకుడు తరగతి గదిలో ఇతర విద్యార్థుల ముందు రాజ్‌ను ‘స్లమ్ డాగ్’ అని పిలిచినట్లు సోదరి వాపోయింది. కాలేజీ ప్రిన్సిపాల్‌కు రాజ్ ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తండ్రి ఆరోపించాడు. వేధించిన అధ్యాపకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తన కుమారుడి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు మీడియాతో అన్నారు.
మరోవైపు రాజ్ ఆత్మహత్య ఘటనపై డెంటల్ కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది. డెంటల్ అనాటమీ విభాగాధిపతి ఎంకే రామ్, అసోసియేట్ ప్రొఫెసర్ కేటీ సంగీత నంబియార్లను శనివారం సస్పెండ్ చేసింది. పోలీస్ విచారణకు సహకరిస్తామని పేర్కొంది.
కాగా, కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. డెంటల్ విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, వారంలోగా నివేదిక సమర్పించాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
Also Read:
167 children rescued | 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలింపు.. రక్షించిన పోలీసులు
Watch: క్లినిక్ షట్టర్లో ఇరుక్కుపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?