Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2019లో అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయంలో బంగారం తాపడాల పునరుద్ధరణ సమయంలో 4.5 కిలోకులపైగా బంగారం మాయమైనట్లుగా సిట్ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దేవస్థానం సైడ్ ప్రేముల్లోని బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లుగా సిట్ తేల్చింది. బంగారం లెక్కల్లో తేడాలు ఉన్నట్లుగా విజిలెన్స్ నివేదికలోనూ ఉందని హైకోర్టు పేర్కొంది. విజిలెన్స్ నివేదికను ట్రావెన్ కోర్ దేవస్థానం ముందు ఉంచాలని కేరళ హైకోర్టు తెలిపింది. దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించింది.
బంగారు తాపడం స్పాన్సర్ అయిన ఉన్నికృష్ణన్ పొట్టికి గణనీయమైన మొత్తంలో బంగారం, సుమారు 474.9 గ్రాములు అప్పగించినట్లు విజిలెన్స్ నివేదిక వెల్లడించిందని జస్టిస్ రాజా విజయరాఘవన్ వీ, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లీక్ కాకూడదని ఆదేశించింది. తాత్కాలిక ఉత్తర్వులో డివిజన్ బెంచ్ సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో నేరుగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి రెండు వారాలకు ఒకసారి కేసు పురోగతికి సంబంధించిన నివేదికను కోర్టు కివ్వాలని చెప్పింది. దర్యాప్తు బృందాన్ని ఇద్దరు అదనపు డీవైఎస్పీలతో పెంచవచ్చని చెప్పింది. ఈ కేసులో కేరళ పోలీస్ బాస్‌ను పార్టీగా చేర్చారు. ఉన్నికృష్ణన్ పాటీ ఈ విషయంపై మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించింది.
బంగారం అవకతవకల్లో నిజమైన దోషులను స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తుతో గుర్తించాలని కోర్టు ఆదేశించింది. కేసులో స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలు రిజిస్ట్రార్ వద్ద భద్రపరచాలని చెప్పింది. అయితే, విచారణ సమయంలో గర్భాలయం ముందు ఉండే ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పూసిన రాగి తాపడాలు ఉండేవని.. వాటిని మరమ్మతుల కోసం తీసుకెళ్లి వచ్చాక బరువు తగ్గినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విచారణ సందర్భంగా బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు స్పష్టం చేసింది. ఈ బంగారు మాయంపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ బంగారం మాయం వివాదంపై ఇప్పటికే కోర్టు.. సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ నెలలోగా రిపోర్ట్ ఇవ్వాలని.. ఆ నివేదికను బహిర్గతం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
సిట్ చీఫ్ ఎస్పీ ఎస్ శశిధరన్, విజిలెన్స్ ఎస్పీ ఎస్పీ బంగారం అవకతవకలపై తుది నివేదికను సమర్పించారు. ఆ తర్వాత దర్యాప్తుపై స్పష్టత కోసం బెంచ్ విడిగా చర్చలు జరిపింది. వీడీ సతీశన్ ఈ అంశంపై మాట్లాడుతూ తీవ్రమైన పరిస్థితి ఉందని.. బంగారం అవకతవకలు కేవలం తాపడాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఇతర ప్రాంతాలకు విస్తరించిందన్నారు. అసలు ద్వారపాలక శిల్పాలను బయట విక్రయించారని.. వాటి స్థానంలో బంగారు పూతపూసి ఫేక్ రాగి పలకలను ఉంచి చెన్నైకి పంపారని కోర్టు ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఈ అంశంలో హైకోర్టు జోక్యానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. అందులో ఎలాంటి సమస్య లేదని.. అక్రమాలను పరిశోధించడానికి హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అక్రమాలు జరిగి ఉంటే దోషులను శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం, కోర్టుది ఒకే లక్ష్యమన్నారు.
వాస్తవానికి శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు. కొత్త బంగారు తాపడాలను చేయించి ఇస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత వాటిని చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. 2019లో ఆ బంగారు తాపడాల బరువు 42.8 కిలోలుగా అధికారులు రికార్డుల్లో చేర్చారు. అయితే, తమ వద్దకు తీసుకువచ్చినప్పుడు తాపడాల బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని చెన్నై సంస్థ చెప్పడంతో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయం నుంచి ఆ బంగారు తాపడాలను తీసిన 40 రోజుల తర్వాత వాటిని చెన్నై సంస్థకు అందించినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు అనేక అనుమానాలు లేవనెత్తింది. ఒకేసారి తాపడాల బరువు 4.524 కిలోలు తగ్గడం ఏంటని ప్రశ్నించింది. దీన్ని తీవ్రంగా తీసుకున్న కోర్టు వాటిని తిరిగి అమర్చిన సమయంలో బరువును ఎందుకు చూడలేదని నిలదీసింది. అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.