ఇటానగర్: కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ జంట(Kerala Couple).. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఆ జంటతో పాటు వెళ్లిన మరో వ్యక్తి కూడా హోటల్ రూమ్‌లో శవాలై తేలారు. నవీన్, దేవి దంపతులు, వారితో పాటు ఫ్రెండ్ ఆర్య కూడా అరుణాచల్ వెళ్లారు. అయితే శరీరంపై అయిన గాయాల నుంచి రక్తం తీవ్రంగా కారడంతో వాళ్లు మృతిచెందారు. మేటి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ బాలన్ మాధవన్ కుమార్తె దేవి. అయితే బహుశా చేతబడి చేసి ఉంటారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. కేరళ పోలీసులు మాత్రం ఆ అనుమానాలను కొట్టిపారేశారు. ఆ ముగ్గురు మొబైల్స్‌ను పరిశీలిస్తే కానీ అసలు ఎటువంటి కారణాలు తెలియవని తిరువనంతపురం సిటీ పోలీసు కమీషన్ నాగరాజు తెలిపారు. తమ పోలీసులు ఇటానగర్ వెళ్లి .. క్లూస్ తీసుకురానున్నట్లు చెప్పారు.
నవీన్, దేవీ దంపతులు.. ఆయుర్వేద డాక్టర్లు అని తెలుస్తోంది. ఆ ఇద్దరికీ పెళ్లి జరిగి 13 ఏళ్లు అవుతోంది. మార్చి 28వ తేదీన ఆ జంట అరుణాచల్ ప్రదేశ్ వెళ్లింది. హపోలిని హోటల్ బ్లూపైన్లో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ పోలీసుల ప్రకారం తొలుత దీన్ని సూసైడ్‌గా అనుమానిస్తున్నారు. అటాప్సీ రిపోర్టు ఆధారంగా కేసును చేధించనున్నట్లు వెల్లడించారు. నవీన్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తుంటాడు. ఆయన భార్య దేవి ఓ ప్రైవేటు స్కూల్లో జర్మనీ బోధిస్తుంది. ఇక ఫ్రెండ్ ఆర్య అదే స్కూల్లో ఫ్రెంచ్ టీచర్.