Kerala Congress | తిరువనంతపురం, సెప్టెంబర్ 1: మహిళా నటులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే మాలీవుడ్ను కుదిపేస్తుండగా, తాజాగా ఆ మకిలి కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుంది. అధినేతలతో ‘సన్నిహిత’ సంబంధాలు ఉన్న మహిళలకే పార్టీలో అవకాశాలు వస్తాయంటూ, లేకపోతే వేధింపులు తప్పవంటూ ఒక మహిళా కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలు ఆ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. దీంతో ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించడం గమనార్హం.
‘క్యాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించగా, కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి పరిస్థితే ఉందని, సినీ పరిశ్రమకు అదేమీ తీసిపోదంటూ ఆ పార్టీ సీనియర్ నేత సిమీ రోజ్బెల్ జాన్ విమర్శలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చాలామంది మహిళలు తాము ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాలను తనతో పంచుకున్నారని తెలిపారు.
పార్టీకి సంబంధించిన మహిళలపై కొందరు పురుష నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, పదవులు ఆశచూపి కొంతమంది సీనియర్ నేతలు మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు తగిన సమయంలో బయటపెడతానని చెప్పారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వారు కూడా దీనిని గమనించాలన్నారు.
ఈ సందర్భంగా ఆమె ఎంపీ జేబీ మేథర్ పేరును, మరికొందరి పేర్లను ప్రస్తావిస్తూ పార్టీలో వారికి అనవసర గౌరవాలు దక్కాయని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్లో ఎనిమిదేళ్ల క్రితమే చేరినప్పటికీ ఆమెను యూత్ కాంగ్రెస్కు అఖిల భారత కార్యదర్శిగా నియమిస్తే తామంతా మౌనంగా ఉండిపోయామని అన్నారు. అధిష్ఠానం ఆదేశాలను అనుసరించడానికి నిరాకరించిన మహిళలపై కొందరు నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కొంతమంది మహిళల పట్ల అలవిమాలిన ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. కాగా, ఆమె చేసిన ఆరోపణలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో రోజ్బెల్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కేపీసీసీ తెలిపింది.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వారికి రక్షణ కల్పించడానికి కేరళలోని పినరయి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆరోపించింది. సోమవారం సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపింది. ఈ ఆందోళనలో యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హుస్సేన్, కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్ తదితరులు పాల్గొంటారు.