శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 17:59:54

కేరళ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ రద్దు

కేరళ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ రద్దు

కొట్టాయం: కేరళకు చెందిన ఒక నన్‌పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్‌ను కొట్టాయం అదనపు జిల్లా కోర్టు సోమవారం రద్దు చేసింది. కోర్టు విచారణలకు ఆయన గైర్హాజరుకావడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఫ్రాంకో న్యాయవాదుల్లో ఒకరికి కరోనా సోకడంతో ఆయన క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పంజాబ్‌లో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో లేదని, ఫ్రాంకో ఉద్దేశపూర్వకంగా కేసును పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

జూలై 1న కూడా కోర్టుకు ఫ్రాంకో హాజరుకాకపోగా ఆయన తరుఫు న్యాయవాదులు ఇలాంటి కారణమే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 2018లో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది.  అలాగే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. 2014 మే 5 నుంచి 2016 సెప్టెంబర్ 23 వరకు బిషప్ ఫ్రాంకో ములక్కర్ తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఒక నన్ ఆరోపించడంతో ఆయనపై ఆ మేరకు కేసులు నమోదు చేశారు.

logo