Kerala Assembly : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక అత్యవసర సవరణ (SIR) ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఇవాళ ఏకగ్రీవ తీర్మానం (Unanimous resolution) చేసింది. కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక అత్యవసర సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న క్రమంలో.. ఆ రాష్ట్రంలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కలిసి అందుకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి ప్రతిపక్ష కూటమి మద్దతు తెలిపింది. దాంతో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా తీర్మానంలో సవరణల కోసం ఎమ్మెల్యే షంసుద్దీన్ చేసిన రెండు ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. మిగతా సవరణల ప్రతిపాదనలను స్పీకర్ తోసిపుచ్చారు.
ఎన్నికల జాబితాలో ‘ప్రత్యేక అత్యవసర సవరణ’ అనేది దేశంలో ‘నేషనల్ పాపులర్ రిజిస్టర్ (NPR)’ అమలుకు వెనుక ద్వారం లాంటిదని తీర్మానంలో పేర్కొన్నారు. కాగా కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అధికార బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోందని దేశంలోని విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.