భోపాల్: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్రీజర్ లేకపోవడంతో హాస్పిటల్ ప్రాంగణంలో యువకుడి మృతదేహాన్ని ఉంచారు. అయితే రాత్రివేళ కుక్కలు ఆ మృతదేహాన్ని పీక్కొని తిన్నాయి. (Dogs Mutilate Body) తెల్లవారుజామున దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాణపుర ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల నిఖిల్ చౌరాసియా పెళ్లి వేడుక తర్వాత స్నేహితులతో కలిసి బైక్పై తిరుగు ప్రయాణమయ్యాడు. శుక్రవారం రాత్రి ఒక వాహనం బైక్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు.
కాగా, నిఖిల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా ఆసుపత్రి ప్రాంగణంలో యువకుడి మృతదేహాన్ని ఉంచారు. అయితే అక్కడున్న కుక్కలు మృతదేహాన్ని పీక్కొని తిన్నాయి. తెల్లవారుజామున చిధ్రమైన నిఖిల్ మృతదేహాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
మరోవైపు ఆసుపత్రి భవనం పాతది కావడంతో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ సౌకర్యం లేదని సివిల్ సర్జన్ డాక్టర్ సుధీర్ విజయవర్గియా తెలిపారు. దీంతో మృతదేహాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారని చెప్పారు. పర్యవేక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను నియమించినట్లు వెల్లడించారు. అయితే డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ గార్డులకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని ఆయన వివరించారు.