న్యూఢిల్లీ: నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలంతా ఏకమైతే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో విడుదలవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఓ రథానికి కేవలం గుర్రాల వంటివాళ్లం, నిజమైన రథసారథి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన త్వరలోనే బయటకు వస్తారు’ అని చెప్పారు. బీజేపీ నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, వారు రాజ్యాంగం కన్నా శక్తిమంతులు కాదన్నారు. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. ఈ నియంతృత్వం కేవలం నేతలను జైళ్లలో పెట్టడం మాత్రమే కాకుండా, ప్రజలను వేధిస్తున్నదని చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో సిసోడియా శుక్రవారం బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే.