ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను సరైన సమయంలోనే నిర్వహించి, వాటిలో గెలిస్తే… ఆమ్ఆద్మీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. ప్రపంచంలోనే తమది పెద్ద పార్టీ అని బీజేపీ వారు పదే పదే చెప్పుకుంటారని, కానీ… చిన్న పార్టీలకు, చిన్న ఎలక్షన్లకు వణికిపోతారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
‘ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడమంటే స్వాతంత్ర సమరయోధులను అవమానించడమే. ఆంగ్లేయులను తరిమి కొట్టడంలో, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో స్వాతంత్ర సమరయోధులు చాలా కృషి చేశారు. అలాంటిది… భయం, ఓడిపోతామన్న నిస్పృహతో ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదావేస్తారేమో’ అంటూ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.
పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ కానున్నది. కార్పొరేషన్ల విలీనానికి మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఢిల్లీకి ఒక్కరే మేయర్ ఉండనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లు కాకుండా ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు కానున్నది.