Kejriwal | ఢిల్లీలో ఆప్ చేసిన మంచి పనులన్నింటినీ ఐదు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలియజేయాలని ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలను ఆదేశించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయవచ్చని ఈసీ ఆదేశించిందని, అందుకే ఆప్ కార్యకర్తలందరూ ఇంటింటికీ తిరుగుతూ ఆప్ సర్కార్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని కేజ్రీవాల్ సూచించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఉన్న ఆప్ కార్యకర్తలతో వర్చువల్గా సమావేశమయ్యారు.
ఏ పార్టీ గురించి కూడా చెడు ప్రచారం చేయాల్సిన పనే లేదని, కేవలం ఆప్ చేసిన మంచి పనులను మాత్రం గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వాలను మార్చే సాధనంగా ఎన్నికలను తాము చూడమని, అటు సొసైటీలో, ఇటు దేశంలో ఎన్నికల ద్వారా ఓ మార్పు వస్తుందన్న దృక్కోణంలో తాము ఆలోచిస్తామని కేజ్రీవాల్ వివరించారు. ఆప్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు చేసే పని అంతా కూడా దేశ సేవే అన్న దృక్పథంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
గోవా ఎన్నికల సందర్భంగా ఆప్ తన అభ్యర్థుల రెండో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ప్రజలకు స్వచ్ఛమైన, నీతివంతమైన పాలనను అందించడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని గోవా ఆమ్ఆద్మీ అధ్యక్షుడు రాహుల్ మహంబ్రే పునరుద్ఘాటించారు.