న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud), ఒక సీనియర్ న్యాయవాదిపై మండిపడ్డారు. వెంటనే కోర్టు నుంచి వెళ్లిపోవాలంటూ ఆయనపై అరిచారు. సుప్రీంకోర్టులో గురువారం ఈ సంఘటన జరిగింది. సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయవాదుల బ్లాక్ కోసం వినియోగించాలని న్యాయవాదుల సంఘం చాలా కాలంగా కోరుతోంది. దీని కోసం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరుపాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఒత్తిడి తెచ్చారు. లిస్టింగ్ కోసం గత ఆరు నెలలుగా న్యాయవాదులు పోరాడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు తెలిపారు. అయితే తనను ఇలా డిమాండ్ చేయడం తగదని ఆయన అన్నారు. మేం ఖాళీగా కూర్చొన్న రోజు ఉందా? అని ప్రశ్నించారు.
కాగా, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘మీరు రోజంతా ఖాళీగా కూర్చున్నారని నేను చెప్పడం లేదు. పిటిషన్ లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అది జరుగకపోతే మీ నివాసం వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్తా. అలాంటి నిర్ణయం తీసుకోకూడదని బార్ భావిస్తున్నది’ అని అన్నారు. దీంతో చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తిని బెదిరించవద్దు. ప్రవర్తించే పద్ధతి ఇదేనా?’ అని మండిపడ్డారు. ‘నేను ప్రధాన న్యాయమూర్తిని. 2000 మార్చి 29 నుంచి నేను ఇక్కడ ఉన్నా. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. బార్ సభ్యుడు లేదా వ్యాజ్యం వేసిన మరెవరితోనూ ఘర్షణ కోరుకోను. నా కెరీర్ చివరి రెండేళ్లలో కూడా అలా చేయను. మిమ్మల్ని సాధారణ లిటిగేట్గానే పరిగణిస్తాను. దయచేసి మీకు ఇష్టం లేని పని చేయమని నా చేతిని బలవంతం చేయకండి’ అని అన్నారు.
మరోవైపు న్యాయవాదుల ఛాంబర్ కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. అందుకే ఈ విషయంపై తాను గట్టిగా పట్టుబడుతున్నానని అన్నారు. బార్ తరుఫున తాను పోరాడుతున్నట్లు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆయనపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దయచేసి గొంతు పెంచవద్దు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రవర్తించే పద్ధతి ఇది కాదు. సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని బార్‌కు ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. నేను నా నిర్ణయం తీసుకున్నా. 17న ఆ నిర్ణయం వెల్లడిస్తా. లిస్టింగ్‌లో మొదటిగా ఉండదు’ అని అన్నారు.
అలాగే గొంతు ఎత్తవద్దంటూ సీజేఐ చంద్రచూడ్ గట్టిగా అరిచారు. ‘నిశ్శబ్దంగా ఉండండి. కోర్టును వదిలివెళ్లండి. మీరు మమ్మల్ని భయపెట్టలేరు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంఘటన నేపథ్యంలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎన్కే కౌల్ ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. బార్ తరపున ఆయనకు క్షమాపణలు చెప్పారు.