Pragya Thakur | బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందు సమాజం తమను తాము రక్షించుకునేందుకు ఇండ్లలో పదునైన ఆయుధాలను పెట్టుకోవాలని సూచించారు. ఆయుధాలు లేకపోతే కనీసం కూరగాయాలు కోసే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రగ్యా ఠాకూర్.. కర్ణాటక శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములందరినీ అంతం చేయాలి. లేనిపక్షంలో ప్రేమకు నిజమైన నిర్వచనం ఇక్కడ లభించదు. లవ్ జిహాద్లో మీ అమ్మాయిలను రక్షించండి. వారికి సరైన విలువలు నేర్పండి’ అని ప్రగ్యా ఠాకూర్ పిలుపునిచ్చారు. శివమొగ్గకు చెందిన హర్షతో పాటు పలువురు హిందూ కార్యకర్తల హత్యలను ఎత్తిచూపిన ఎంపీ.. హిందువులు స్వీయ రక్షణ కోసం ఇంట్లో కత్తులను పదును పెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి దారుణాలను నుంచి రక్షించుకునేందుకు ప్రతీ హిందువు తమ తమ ఇండ్లలో ఆయుధాలు ఉంచుకోవాలన్నారు. కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా పదును పెట్టి సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పారు. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి మనపై దాడి చేస్తుంటే తగిన రీతిలో సమాధానం ఇవ్వడం మనకున్న హక్కు అని అన్నారు.