చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్‌పై ఇవాళ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు అనుకూల పథకాలు, వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఆయన వివరించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఈ ఎనిమిదేండ్లలో ఎంతో పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు తమ ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుకున్నారని తెలిపారు. అడవులు పెంచి, పర్యావరణాన్ని కాపాడడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న విషయాన్ని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉందన్నారు.
దక్షిణ భారత రైతు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పీకే దైవ శిగామణి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గత నెలలో తెలంగాణలో పర్యటించిన రైతులు.. కేసీఆర్‌తో రెండు రోజుల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అయితే తమిళనాడులో ప్రజలను, రైతులను చైతన్యవంతం చేసి కేసీఆర్ మోడల్ తమిళనాడులో అమలయ్యే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు. మొదటగా తమిళనాడులోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ లేఖలు రాసి కేసీఆర్ మోడల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. అనంతరం కన్యాకుమారి నుంచి చెన్నై వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేస్తామన్నారు.