హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : 14 ఏళ్ల పాటు సాగిన మలి తెలంగాణ సాధన ఉద్యమానికి శిబూ సొరేన్ సహకారం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ మృతిపై సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం హేమంత్ సొరేన్‌ను ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా శిబూ సొరేన్తో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. 2001లో హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సభకు ఆయనను తొలి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర కల సాకారమయ్యేదాకా అడుగడుగునా అండగా నిలిచారని చెప్పారు. ఆయన మరణం జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని అభివర్ణించారు. ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల హక్కులు, అస్తిత్వ ఉద్యమం కోసం జీవితాన్ని ధారపోసిన గొప్ప నాయకుడని కీర్తించారు.
బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకు శిబూ సొరేన్ అంత్యక్రియలకు గౌరవ సూచకంగా మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కోవ లక్ష్మిని పంపిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారు పార్టీ తరఫున సొరేన్‌కు నివాళులర్పిస్తారని పేర్కొన్నారు.